ప్రజాశక్తి-సత్తెనపల్లి : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, లేకుంటే మరో విద్యుత్ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని మహాలక్ష్మి చెట్టు వద్ద విద్యుత్ వినియోగదారులతో ఆయన సమావేశ నిర్వహించారు. సమావేశానికి హాజరైన మహిళలు గతంలో వందల్లో వచ్చిన విద్యుత్ బిల్లులు ప్రస్తుతం వేళల్లో వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ చార్జీల పై నిరసనగా స్వచ్ఛందంగా వారు తమ విద్యుత్ బిల్లులను దహనం చేశారు. ఈ సందర్భంగా విజరు కుమార్ మాట్లాడుతూ గతంలో వైసిపి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినప్పుడల్లా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకించారని, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే రూ.18 వేల కోట్ల విద్యుత్ భారం ప్రజలపై వేశారని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు సిపిఎం ఉద్యమిస్తుందని, ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి డి.విమల, నాయకులు డి.వెంకటేశ్వర్లు, డి.పుల్లారావు, షేక్ సైదులు, సుధారాణి, జె.రాజ్‌కుమార్, పి.శివపార్వతి, ఎస్.సునీత, సిహెచ్ పావని, కె.కోటేశ్వరి పాల్గొన్నారు.
