ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, గ్రేటర్ విశాఖ బ్యూరో అనకాపల్లి జిల్లాలోే రైతులకు న్యాయం జరిగేలా వారి భాగస్వామ్యంతో మూతపడ్డ మూడు సుగర్ ఫ్యాక్టరీలలో ఇథనాల్ తయారీకి ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రైతులకు న్యాయం చేయడం ఎన్‌డిఎ ప్రభుత్వ మొదటి కర్తవ్యమన్నారు. ఎస్.రాయవరం మండలం, దార్లపూడి వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ అక్విడెక్ట్ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డంతో రైతులకు అన్యాయం జరిగిందని, ఉద్యోగులకు జీతాల్లేవనే పరిస్థితిలేకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తామని చెప్పారు. ఈ పని జరిగేలా ఎమ్మెల్యేలతో మాట్లాడే బాధ్యత ఎంపీ సిఎం రమేష్, మంత్రి అనితకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు ఘన స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి అనకాపల్లి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దార్లపూడి హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజరుకుమార్, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్‌పి కెవి మురళీకృష్ణ పుష్ఫగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.గ్లోబల్ యూనిక్ హబ్‌గా మెడ్ టెక్ జోన్ వైద్య పరికరాల (మెడికల్ డివైసెస్) తయారీలో గ్లోబల్ యూనిక్ హబ్‌గా విశాఖ మెడ్ టెక్ జోన్ అవతరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సాయంత్రం 5గంటలకు విశాఖలోని మెడ్‌టెక్ జోన్ సిబ్బంది, భాగస్వాములను ఉద్దేశించి ప్రసంగించారు. గ్లోబల్ మెడ్ టెక్ యూనివర్శిటీని, సైక్లో ట్రాన్ సెంటర్లను ఈ సందర్భంగా ఇక్కడ ప్రారంభించారు. దేశంలోని 20 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మెడికల్ డివైసెజ్ ఎంఆర్‌ఐ, సిటి స్కాన్ వంటివి ఉత్పత్తయి సరఫరా అవుతున్నాయని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వమే వినియోగించకపోవడం దారుణమని పేర్కొన్నారు. హెల్త్ కేర్‌లో 28 రకాల వైద్య పరికరాల తయారీ జరుగుతుండడం మంచి పరిణామమన్నారు. మెడ్ టెక్ సిఇఒ జితేంద్ర శర్మ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని కొనియాడారు. పారిశ్రామిక వేత్తను ప్రోత్సహిస్తాంగత ప్రభుత్వం మాదిరిగా పెట్టుబడులను అడ్డుకునే ప్రభుత్వం తమది కాదని, రాష్ట్రాభివృద్ధి కోసం పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి తగిన గౌరవం ఇస్తామని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మీకు అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఐఐ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.ఎయిర్‌పోర్టులో అధికారులతో సమీక్ష గురువారం సాయంత్రం 6.30గంటలకు ఎయిర్ పోర్టులో విశాఖపట్నం జిల్లా ఉన్నతాధికారులు, పోర్టు అధికారులతో సమావేశం అయ్యారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగిందని తాగునీటి ప్రాజెక్టులన్నీ మూలనపడ్డాయని చెప్పారు. పుష్కర లిఫ్ట్ నుంచి అనకాపల్లికి నీరు తేవాలంటే రూ.800కోట్లు ఖర్చుచేయాలని, ఇది పూర్తయితే 2 లక్షల ఎకరాలకు నీరొస్తుందని తెలిపారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు. ట్రైబల్ యూనివర్శిటీకి గతంలో ఎక్కడైతే స్థలం ఇచ్చామో పనులు అక్కడే మొదలుపెడతామని చెప్పారు. రైల్వేజోన్‌కు అవసరమైన భూమి ఇవ్వలేదనే వివాదం ఉందని, వారికి ఆమోదయోగ్యమైన స్థలం ఇచ్చి రైల్వే జోన్ పనులను చేపడతామని తెలిపారు. పంచ గ్రామాల సమస్యను, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని అధికారులకు తెలిపారు. దక్కన్ క్రానికల్ కార్యాలయం ఎదుట ఇటీవల టిడిపి శ్రేణుల నిరసనలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, తప్పు చేసిన వారి ఆఫీసుల వద్ద నిరసనలు అవసరం లేదని చట్ట ప్రకారం ముందుకెళదామని సూచించారు. విశాఖ పోర్టులో పొల్యూషన్‌ను తగ్గించాల్సి ఉందని దీనిపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలన్నారు. సింహాచలం భూముల్లో చాలామంది ఇల్లు కట్టుకున్నారని అన్నీ పరిశీలించి అనుమతులివ్వాలని సూచించారు.
