ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మున్సిపాలిటీలోని 5వ వార్డులో ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా కందుల నారాయణరెడ్డి పర్యటించారు. ఆ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. కొందరు పింఛన్లు, రేషన్ కార్డులు కావాలని కోరారు. మరి కొందరు సొంత ఇల్లు లేదని, పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. ప్రధానంగా సాగర్ నీరు అందరికీ అందడం లేదని, కుళాయి కనెక్షన్‌లు కూడా అందరికీ లేవని ఎమ్మెల్యే కందుల దృష్టికి కొందరు తీసుకొచ్చారు. ఈ వార్డు ఒక్కటే కాదని, మిగిలిన వార్డుల్లో కూడా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. సిమెంటు రహదారుల కింద పైప్‌లైన్‌లు ఉన్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో లోపలి భాగంలో లీకులు ఏర్పడ్డాయని అన్నారు. దీని కారణంగా నీటి సమస్య తలెత్తిందన్నారు. వీలైనంత త్వరగా నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అధికారులతో చర్చిస్తామని చెప్పారు. పింఛన్లు, పక్కా గృహాలు, రేషన్ కార్డుల మంజూరు వంటివి త్వరలో రాబోతున్నాయని, అర్హత కలిగిన వారంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, ఎఎంసి మాజీ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, టిడిపి కీలక నేతలు వక్కలగడ్డ మల్లికార్జునరావు, మాలపాటి వెంకటరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, పలువురు కౌన్సిలర్లు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
