ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : పట్టణంలోని తురకపల్లి రోడ్డులో సోమవారం రాత్రి రైల్లో నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం లోని యాదగిరి జిల్లా కనేకల్ చెందిన మల్లికార్జున (28) అనే కార్మికుడు భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. అతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈనెల 22వ తేదీన తన సోదరితో కలిసి రైల్లో కనేకల్ కు వెళ్లాడు. సోదరిని తమ స్వగ్రామంలో వదిలి తిరుగు ప్రయాణం అయ్యాడు. యాదగిరి నుంచి బెంగళూరుకి రైలులో వెళుతుండగా గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డులో రైలు బోగి తలుపు వద్ద నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని సీఐ బి.వెంకటేశ్వర్లు పరిశీలించారు. జీఆర్పీ ఎస్సై నాగప్పకు సమాచారం అందించారు. జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప, కానిస్టేబుల్ వాసు లు మల్లికార్జున మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య కుమార్తె కలరు . ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
