ఓట్లు అమ్మబడవని యానాది కాలనీవాసుల ప్రతిజ్ఞ

Apr 17,2024 00:06

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి: అత్యంత నిరుపేదలమైన తాము ఏ రాజకీయపార్టీకీ అమ్ముడుబోమని, నిజాయితిగా తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటామని, తమ ఓట్లు అమ్ముకోబోమని కాకుమానువారితోట ఐదో లైను యానాది కాలనీలో బహుజన మహసభ ఆధ్యర్యంలో ‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’ అని వినూత్నంగా నిరసన తెలిపారు. కాలనీవాసులందరూ ప్రతిజ్ఞ చేసి ఓట్లకు డబ్బులతో కొనలేరు అని రుజువు చేస్తూ మాకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్రం రాకముందు కేవలం కొన్ని వర్గాల వారికే ఓట్లుండేవని, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో పుట్టిన ప్రతి వయోజనులకూ ఓటు హక్కు కల్పించారని బహుజన మహాసభ అధ్యక్షులు జి.ఆర్‌.భగత్‌ సింగ్‌ అన్నారు. ఇప్పటికీ చాలా మందికి ఆధార్‌ కార్డు, ఓటు లేక, చదువు, నివాసం లేక రోడ్లపక్కనే జీవిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సిపిడిసిఎల్‌ రిటైర్డ్‌ సిజిఎం కె.భాస్కర్‌, షేక్‌ ఖాజావలి, ప్రముఖ న్యాయవాది పి.ప్రసాదరావు, బహుజన ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు డి.సురేష్‌, న్యాయవాదులు ఆర్‌.మణికుమార్‌, వెంకటేశ్వరరావు, అంబేద్కర్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌ నాయకులు బి.విల్సన్‌, వి.ముత్తయ్య, రవికుమార్‌, జి.విజరు కుమారి, పి.గౌరీ శిరీష, బి.సుధాకర్‌, ఎ.కుమార్‌ పాల్గొన్నారు.

➡️