- తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు
ప్రజాశక్తి – జగ్గంపేట(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో ప్రయివేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… జగ్గంపేటలోని స్వామి వివేకానంద పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకొచ్చేందుకు మండలంలోని కాండ్రేగుల గ్రామానికి మంగళవారం ఉదయం వెళ్లింది. అక్కడ 13 మంది విద్యార్థులను ఎక్కించుకుని తిరుగుపయనమైంది. మార్గమధ్యలో పంది అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే స్థానికులు బస్సులో నుంచి విద్యార్ధులను బయటకు తీసుకొచ్చారు. గాయపడిన తొమ్మిది మంది విద్యార్థులను జగ్గంపేట సిహెచ్‌సికి తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రఘునందరావు తెలిపారు. ఈ ఘటనపై ఎంఇఒ ఆర్.స్వామి మాట్లాడుతూ.. మంగళవారం నుంచి మండలంలో ఉన్న అన్ని ప్రయివేటు పాటశాలలో వాహనాల పట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.