5లోగా సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు
ప్రజాశక్తి – సాలూరు : తమ సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం మున్సిపల్ కార్మికులు గాంధీ నగరం నుంచి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం గ్రీవెన్స్ వద్ద ధర్నా చేపట్టారు. ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, యూనియన్ సాలూరు అధ్యక్ష కార్యదర్శులు టి.రాముడు, టి.శంకర్రావు మాట్లాడారు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూడాల్సిన పరిస్థితి మున్సిపాలిటీలో ఉందని, ఏనెల జీతం ఏ సమయానికి వేస్తారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. పండగల పూట కార్మిక కుటుంబాలు పస్తువులతోనే ఉన్నాయని, డిసెంబర్ జీతం ఇంకా వేయలేదని, జనవరి జీతం ఎప్పుడు వస్తుందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రెండున్నరేళ్లుగా గత పాలకవర్గం కాలయాపన చేస్తే, నేడు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా కదలికలేదని, చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని పట్టణాల్లో సబ్బులు, నూనెలు, చెప్పులు ఇస్తున్నా, ఇక్కడ డబ్బులు లేవనే కుంటి సాకులతో తప్పించుకుంటున్నారని చెప్పారు. జీవో 36 ప్రకారం డ్రైవర్ల వేతనాలు ఇవ్వాలని కోరారు. గ్రీవెన్స్‌కు హాజరైన మంత్రి సంధ్యారాణి కార్మికుల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకొని మాట్లాడారు. బకాయి జీతాలు వెంటనే వేయించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య లేకుండా చేస్తానని, కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, నూనెలు, చెప్పులు మున్సిపాలిటీ వద్ద నిధులు లేకుంటే తన నిధుల నుండి ఇచ్చి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వీలైనంత తొందరగా ఉద్యోగాలు వేసేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అధికారులు మంత్రి హామీని అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించుకుంటే ఫిబ్రవరి 5 తర్వాత సమ్మెకు వెళ్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పోలరాజు, లింగరాజు, దేవి, ఆదినారాయణ, శ్రీను, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.