ప్రజాశక్తి-తెర్లాం : మండలంలో ఎంఆర్ అగ్రహారం రెవెన్యూ పరిధిలో ఎన్‌ఎస్‌ఆర్ ఎల్లాయీస్ పరిశ్రమ ఏర్పాటుపై శుక్రవారం డిఆర్‌ఒ ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యాన ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు చీఫ్ ఇంజినీర్ ప్రసాదరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇఇ సరితతోపాటు ఎంఆర్ అగ్రహారం, ఎం.గదబవలస, రంగప్పవలస, ఉత్తరావల్లి గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఎంఆర్ అగ్రహారం సర్పంచ్ ప్రతినిధి లొట్టి వెంకట్రావు మాట్లాడుతూ పరిశ్రమ వల్ల ప్రజలకు, పంట పొలాలకు ఎలాంటి నష్టమూ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. స్థానికులకు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. పరిశ్రమ యాజమాన్య ప్రతినిధి యుఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ పరిశ్రమ వల్ల రైతులకు, పంట పొలాలకు ఎలాంటి నష్టమూ ఉండదని, దానికి బాధ్యత వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి.హేమంత్ కుమార్, ఎస్‌ఐ జి.సాగర్ బాబు, ఎంఆర్‌ఐ ఎంఎస్‌కె నాయుడు, విఆర్‌ఒ ఎస్.నరసింహనాయుడు, పంచాయతీ కార్యదర్శి పి.హైమావతి, నాయకులు గోపి, తదితరులు పాల్గొన్నారు.
