ప్రజాశక్తి- పర్చూరు : అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సిడిపిఒ జి.సుభద్రకు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గతేడాది అంగన్‌వాడీలు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన 42 రోజులు సమ్మెకు సంబంధించి వేతనం ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. ఆ ఒప్పందాన్ని అమలు చేసి వేతనాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ ఇవ్వాలని, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. టిఎ బిల్లు, మెనూ ఛార్జీలు పెంచాలని, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొమ్మినేని శ్రీనివాస రావు, బత్తుల హనుమంతరావు ,చినదాసు, అంగన్‌వాడీ యూనియన్ పర్చూరు ప్రాజెక్టు కార్యదర్శి రాణి, శ్యామల ,రమ పాల్గొన్నారు.
