ప్రజాశక్తి – నిజాంపట్నం : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని, అర్హులైన హెల్పర్స్‌కు ప్రమోషన్ కల్పించాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్. మణిలాల్ కోరారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పలపల్ల సిడిపిఒ అనసూయకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిలాల్ మట్లాడుతూ గతంలో అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు మినిట్స్ కాపీ ఇచ్చినట్లు తెలిపారు. మినిట్స్ కాపీ ఇచ్చి ఏడాది గడిచిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడం లేదన్నారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలు మార్చాలన్నారు. సర్వీసులో ఉండి చని పోయిన అంగన్‌వాడీలకు దహన సంస్కార ఖర్చులకు రూ.20,000 ఇవ్వాలన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లపట్ల అంగన్ వాడీ ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్షురాలు వై.మేరీమణి, నాయకులు ఉష, బేబీరాణి, చైతన్య, మల్లేశ్వరి,శిరీషా పాల్గొన్నారు.
