ప్రజాశక్తి-వేంపల్లె రాష్ట్రంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధి లోని నాలుగు ట్రిపుల్‌ఐటిలకు నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆర్జె యుకెటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విజరు కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ఐటిని సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ఐటిలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్‌ఐటిలకు నూతన భవనాలు, ఇన్ఫ్రాస్టక్చర్్, కంప్యూటర్లు, మౌలిక వసతులు, తదితర వాటికి రూ.300 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గతంలో రూ.100 కోట్లు అడగగా రూ.50 కోట్లు జీతాలకే సరిపోయిందన్నారు. ప్రస్తుతానికి ఒంగోలు ట్రిపుల్ఐటికి సంబంధించి నూతన భవనాలు రూ.200 కోట్లు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటికి సంబంధించి రూ.50 కోట్లు, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్‌ఐటిలకు సంబంధించి రూ.50 కోట్లు అవసరం ఉంద న్నారు. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పియుసి, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 660 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చిందన్నారు. అయితే కొందరు కోర్టుకు పోవడంతో పోస్టుల భర్తీ ఆగిపోయిందని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కోర్టు కేసులను క్లియర్ చేసిన తర్వాతనే రీ-నోటిఫికేషన్ ను ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించనుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నిధులు అంతంత మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతుల పనిచేస్తున్న అధ్యాపకులకు మినిమం టైం స్కేల్‌ను అందించాలని విలేకరులు అడగగా ఈ విషయంపై తమ చేతుల్లో లేదని ప్రభుత్వ మే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ట్రిపుల్‌ఐటిలలో కొత్తగా ఎఐఎంఎల్ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ మిషన్ లర్నింగ్) కోర్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే ఈ కోర్సుకు సంబంధించి గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అనంతరం ట్రిపుల్‌ఐటిలలో చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా సైకాలజిస్ట్‌లను పిలిపించి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని డైరెక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో ఆర్‌జెయుకెటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ సండ్ర, డైరెక్టర్లు ప్రొఫెసర్ కుమారస్వామి గుప్తా, ప్రొఫెసర్ బాలాజీ, ప్రొఫెసర్ భాస్కర్ పటేల్ పాల్గొన్నారు.
