ఫార్మా రంగంలో నిపుణుల కొరత

Apr 11,2025 23:51

మాట్లాడుతున్న ఐహెచ్‌ఎంఆర్‌ డైరెక్టర్‌ ఉషా మంజూనాథ్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
ఫార్మా రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఎక్కువగా ఉందని బెంగుళూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉషా మంజూనాథ్‌ చెప్పారు. బెంగుళూరుకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో గుంటూరులోని ఒక హోటల్‌లో శుక్రవారం జరిగిన ఫార్మా టెక్‌ కవరేజి-2025 సదస్సులో ఆమె మాట్లాడారు. ఫార్మాలో విద్యారంగం, ఔషధపరిశ్రమ మధ్య క్లిష్టమైన అంతరాలు ఉన్నాయని, ఫార్మసీ విద్యార్థులు మరింత నిష్ణాతులుగా తయారు కావాలని అన్నారు. విద్యాశాస్త్రం, పరిశోధన, కన్సల్టెన్సీ, శిక్షణ, సెంటర్‌ ఫర్‌ అడ్వాన్సింగ్‌,. డిజిటల్‌ హెల్త్‌ తదితర అంశాలపై మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణ, పరివర్తనకు సంస్థ తమ చేస్తున్న కృషిని వివరించారు. సంస్థ సీనియర్‌ సలహాదారుడు, మాజీ ఐఎఎస్‌ అధికారి డాక్టర్‌ సిఎస్‌.కేదార్‌ మాట్లాడుతూ ఇండియాలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కొరత ఉందన్నారు. దేశాన్ని ప్రపంచ ఫార్మసీగా అభివర్ణిస్తూ వేగవంతమైన ఆవిష్కరణలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన విద్యా వ్యవస్థల ద్వారా ప్రపంచ నాయకత్వం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సిప్లా కంపెనీ బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌ ఎస్‌.బెనర్జి మాట్లాడుతూ ఫార్మారంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆర్టిఫిషియల్‌ ఇంటిల్‌జెన్స్‌ అనుసంధానం వంటి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సాంకేతిక అంశాలు, కృత్రిమ మేథస్సు, డిజిటల్‌ యుగం, నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్య అంతరాన్ని పరిష్కరించాలన్నారు. ఫార్మారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహాకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ జి.వీరపాండ్యన్‌, ఎన్‌టిఆర్‌ వైద్య సేవ సిఈవో, రాష్ట్ర డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరక్టర్‌ జనరల్‌ పి.రవి సుభాష్‌ వివరించారు. విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాసబాబు, సెయింట్‌ మేరిస్‌ కళాశాల ప్రొఫెసర్‌ పుప్పాల రామన్‌కుమార్‌, సిద్దార్ధ కళాశాల ప్రిన్సిపల్‌ ఎ.సునీత మాట్లాడారు.

➡️