ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కొరకు అవిశ్రాంత పోరాటం చేసి.. అమరుడైన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆర్యవైశ్యులు ఘన నివాళులర్పించారు. మండలంలోని ఉండ్రాజవరం, పాలంగి గ్రామాలలో ఏర్పాటు చేసిన శ్రీరాములు విగ్రహాలకు సంఘం ఆధ్వర్యంలో పూలదండలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రాజేష్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు చేసిన ఆమరణ నిరాహారదీక్షతో తృణప్రాయంగా, ప్రాణాలర్పించి, అమరజీవిగా ఆంధ్రుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహా పురుషుడని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయులన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సేవా సంఘం మండల మాజీ అధ్యక్షులు కొర్లేపర పుల్లేశ్వరరావు, పాలంగి శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య యువజన సంఘం సెక్రటరీ సింహాద్రి వీర వెంకట సత్య నారాయణ గుప్త, యువజన సంఘం సభ్యులు పచ్చిపులుసు పుల్లేశ్వరరావు, తటవర్తి సత్యనారాయణ, నాగవరపు సత్యనారాయణ, నూలు సుబ్బారావు, కోట్ల కాశీ, గమని కుమార్, ముత్తా రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
