ప్రజాశక్తి- కొల్లూరు : లంక భూముల పోరాటంలో చల్లపల్లి జమిందారికి వ్యతిరేకంగా 1947లో దున్నేవానికే భూమి కావాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకీ గుళ్ళకు గుండెలు ఎదురు చూపి ప్రాణాలు పణంగా పెట్టిన బావిరెడ్డి వియమ్మ, సనక సుబ్బారావు, మత్తే సుబ్బారావు, తాడిశెట్టి వెంకటేశ్వర్లుకు ఘన నివాళులర్పించారు. మండల పరిధి గాజులంక గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద సిపిఎం నాయకులు గురువారం జెండా ఆవిష్కరణ చేసి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వేములపల్లి వెంకట రామయ్య మాట్లాడుతూ గత 78 సంవత్సరాల క్రితం చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా పోరాటం నడిపి పేదల పక్షాన నిలిచిన వీరనారి వీయమ్మ అని తెలిపారు.పంతగాని నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా, పేదల బతుకులు మారడం లేదని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. తొలుత సిపిఎం సీనియర్ నాయకులు సనక అగ్గి రామయ్య అమరవీరుల స్థూపానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ నాయకులు బొనిగల సుబ్బారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
