ప్రజాశక్తి – కడప : అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతోపాటు పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి కడప విమానాశ్రయానికి ఈరోజు మధ్యాహ్నం 12.22 గంటలకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సీఎంకు ఘన స్వాగతం పలికారు. కడప విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి, ఇంఛార్జి కడప ఆర్డీఓ సాయిశ్రీ, కడప డిఎస్పీ వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య, నేతలు గోవర్ధన్ రెడ్డి, హరి ప్రసాద్, ఎన్. రాఘవరెడ్డి, ఆసం రఘురామి రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అన్నమయ్యలోని సంబేపల్లి కి మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.
