సమస్యల పరిష్కారానికే ప్రత్యేక ప్రజా దర్బార్‌

Oct 8,2024 21:04

ప్రజాశక్తి – కొమరాడ  : ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికే ప్రత్యేక ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. మంగళవారం కూనేరులో మండల స్థాయి ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతల స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా దర్బార్‌ వల్ల ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పుకోవచ్చని, వీలైనంత వరకు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. ఈ ప్రజా దర్బార్‌లో ఎక్కువగా హౌసింగ్‌, పెన్షన్లు, రిటర్నింగ్‌ వాల్‌, రహదారులు డ్రైనేజీలు ప్రజల వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యలను గురించి వినతులు ఎక్కువగా వచ్చాయి. అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయాలని కొన్ని గ్రామాల ప్రజలు వినతిపత్రం ఇచ్చారు. మండలంలో అధ్వానంగా మారిన రహదారులు, చెక్‌డాంల మరమ్మతులు చేపట్టాలని కోరారు. కొన్ని గ్రామాలకు విద్యుత్‌ లైన్ల సౌకర్యాలు కొత్తగా కల్పించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ప్రజలు తెలిపిన వ్యక్తిగత, సామాజిక సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో మండల పరిషత్‌ ఎఒ రమేష్‌, ఇన్‌ఛార్జ్‌ తహశీల్దార్‌ శివయ్య, వివిధ మండల స్థాయి అధికారులు, మండల టిడిపి అధ్యక్షులు శేఖర్‌ పాత్రుడు, నాయకులు దేవకోటి వెంకటనాయుడు, జి సుదర్శన్‌ రావు, మధుసూదనరావు, వెంకటనాయుడు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మండలంలో దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎంమండలంలో దీర్ఘకాల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరికి మండలంలో గల పలు సమస్యల పైన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ బట్టివానివలసలో పదిరోజుల్లో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మారిన మెల్లిక సంధ్యారాణి, పవన్‌కుమార్‌ను ఆదుకోవాలని కోరారు. 16ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న పూర్ణపాడు-లాబే సు వంతెన పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయమని కోరగా, ఆ వినతి పత్రాన్ని పంచాయతీరాజ్‌ శాఖ ఇఇకి ఫార్వర్డ్‌ చేసినట్లు తెలిపారు. ఏనుగుల సమస్య కూడా పరిష్కరించాలని, ఈ ప్రాంత ప్రజలను, రైతులను, పంటలను కాపాడాలని కోరారు. పార్వతీపురం నుంచి కూనేరుకు మూడు రాష్ట్రాలకెళ్లే రహదారి గడిచిన నాలుగు ఏళ్లుగా గోతులుగా మారడం, ఆ గోతుల్లో వర్షం నీటిలో పడి వాహనదారుల అనేకమంది ప్రమాదాల బారినపడి మృతి చెందడం, క్షతగాత్రులవుతున్నారన్నారు. ఐదేళ్లుగా ఇసుక మాఫియా పెద్ద ఎత్తున జరిగిందని, దీనివల్ల భవన కార్మికులు, ట్రాక్టర్‌, ఇతర కార్మికులకు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అన్నారు. కావున మండలంలో గల నాగావళి నదీ తీరాన గతంలో ఉన్న కూనేరు రామద్రపురం, కొమరాడ, దుగ్గి, కలికోట, కొట్టు దలై పేటలో ఇసుక రీచ్‌ లను వెంటనే ప్రారంభించి అటు భవన కార్మికులకు, ఇటు మండలంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ సమస్యలను ఎమ్మెల్య ఈనెల 25లోగా పరిష్కరించే దీక్షగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేయించేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో ఈ సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు.

➡️