దుగ్గిరాల ప్రాంతంలో యంత్రాలతో వరికోతలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారుతోంది. బుధవారం సాయంత్రం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ఇప్పటికే కొంత మంది కోతలు కోస్తుండగా మరికొంత మంది వచ్చే వారంలో కోతలకు సిద్ధం అవుతున్నారు. ఈ దశలోతుపాను వచ్చి భారీ వర్షాలు కురిస్తే పైరు నీట మునిగి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డెల్టా ప్రాంతంలో ఈ ఏడాది 1.48 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎక్కువ మంది వెదపద్థతిలో సాగు చేశారు. జులైలో సాగు చేసిన ప్రాంతాల్లో వరి పైరు కోతలకు సిద్ధమైంది. పంట చేతికి వచ్చే సమయంలో తుపాను సంభవించడం వల్ల తీరని నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుగ్గిరాల, కొల్లిపర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో వరి కోసి కుప్పలు వేసి పొలాల్లో ఉన్నాయి. ఇప్పుడు వర్షం వస్తే వరి పనలు తడిసి మొలకొచ్చి ధాన్యం నాణ్యత తగ్గి అపారనష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యంత్రాలతో నూర్పిడి చేయిస్తే తేమ శాతం 23 వరకు ఉంటోంది. దీంతో వెంటనే ధాన్యం అమ్ముకోలేక ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజులు ఆరబెడితే గానీ మిల్లర్లు కొనని పరిస్థితి నెలకొంది. గరిష్టంగా 17 శాతం మించి తేమ ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యంత్రాలతో కోయిస్తే ఒక ఇబ్బంది, కూలీలతో కోసి కుప్పలు వేస్తే మరో ఇబ్బంది వస్తుందని రైతులు వాపోతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో వరి సాగు చేశారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం పొట్టదశలో ఉంది. భారీ వర్షం కురిసి ముంపు సమస్య ఏర్పడితే పైరుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు తుపాను సంభవిస్తే తీయడానికి సిద్ధంగా ఉన్న పత్తి నేలరాలే ప్రమాదం ఉంది. గుంటూరు జిల్లాలో 53 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా పల్నాడు జిల్లాలో 1.65 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పత్తిపై ఉన్న పూత, పిందే కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మిర్చి పైరు ఇప్పటికే పూతదశలో ఉంది. పల్లపు ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడితే పైర్లు ఉరకెత్తే ప్రమాదం ఉంది. రెండు జిల్లాల పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో మిర్చి సాగైంది. మిర్చి పైరు చాలా ప్రాంతాల్లో పూతదశలో ఉండటం వల్ల భారీ వర్షం కురిస్తే నష్టం కొంత వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 31న కురిసిన దాదాపు 43 వేల ఎకరాల్లో అతి భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మళ్లీ పంటలు చేతికి వచ్చే సమయంలో తుపాను రావడం అటు అధికారులలో ఇటు రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. తుపాను ప్రభావంతో జిల్లాలో చలిగాలులు మరింత పెరిగాయి.