ప్రజాశక్తి-చిలకలూరిపేట : ప్రతిరోజూ తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చెప్పారు. మున్సిపల్ సాదారణ సమావేశం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. వైసిపి కౌన్సిలర్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ మురుగు గణపవరానికి రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డులో మంత్రి ఇంటి నిర్మాణం కోసం డ్రెయిన్ల స్వరూపాన్నే మార్చివేశారని, పలు కాలనీలలో ముంపు సమస్య ఏర్పడిందని టిడిపి పక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు చెప్పారు. దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన అధికారుల మీదా చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిల్ సమావేశాలకు హాజరుకాని కౌన్సిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆక్రమణల తొలగింపులో అలసత్వం పనికిరాదన్నారు. నరసరావుపేట సెంటర్, ఎస్‌బిఐ కార్యాలయం కాంప్లెక్స్ వద్ద సర్వీసు రోడ్లపై ఆక్రమణలు పెరిగాయని చెప్పారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఫ్లెక్సీలను తొలగించాలని కోరారు. 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి మాట్లాడుతూ అక్రమ కుళాయిలను క్రమబద్ధీకరించాలని, బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నా స్పందన కరువైందన్నారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. వైసిపి కౌన్సిలర్ వడితే కోట్యానాయక్ మాట్లాడుతూ నరసరావుపేట రోడ్డులో డివైడర్లు ప్రారంభమయ్యే ప్రాంతంలో, టిడిపి కార్యాలయం వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తన కుమారుడ్ని సైతం రోడ్డు ప్రమాదం రూపంలో కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరిబాబు వివరణిచ్చారు. గణపవరం వద్ద కాల్వ నిర్మాణానికి రూ.25 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపామన్నారు. తాను విధుల్లో చేరిన తర్వాత 633 నిర్మాణాలపై పన్నులు వేశామని, రూ.48 లక్షలు వసూలు చేశామని చెప్పారు. అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు రూ.10 కోట్లు ఆస్తి, నీటి కుళాల పన్నులు వసూలుకు ప్రత్యేక కార్యచరణ సిద్దం చేసినట్లు చెప్పారు. బస్‌షెల్టర్ల నిర్మాణానికి కొంతమందితో చర్చించామని, త్వరలోనే పనులు చేపడగామని అన్నారు. ఇటీవల తమకు కేటాయించిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర సర్వేల వల్ల ఆక్రమణల తొలగింపు జాప్యమైందన్నారు. అనధికార ఫెక్సీలు తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించామన్నారు. టిడ్కో గృహాల వద్ద పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు.