ప్రజాశక్తి-గంట్యాడ : తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం వెయ్యి రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఐసిడిఎస్ పీడీ రుక్సానా బేగం తెలిపారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని కొర్లాం అంగన్వాడీ కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. గర్భం దాల్చిన నుంచి బిడ్డకు రెండేళ్లు వయసు వచ్చే వరకు పోషక విలువలతో కూడిన ఆహారం అందాలని, దానివల్ల ఆరోగ్యవంతమైన తరం సమాజానికి అందుతుందని చెప్పారు. పోషకాహార లోపం పెద్ద సమస్యని, దాన్ని నివారించడానికి ప్రత్యేకంగా గుర్తించి, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. పిల్లల్లో ఊబకాయ సమస్యను తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రీస్కూల్ పిల్లలతో ఆమె మమేకమయ్యారు. గృహ సందర్శనలో భాగంగా బాలింతలకు అందుతున్న పౌషకాహారంపై ఆరాతీశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ కె.పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
బొండపల్లి : మండలంలోని గొట్లాం సెక్టార్ పరిధిలోని నెలివాడ గ్రామంలో పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ జానకి, ఎంఎల్‌హెచ్‌పి మౌనిక, ఎఎన్‌ఎం కె.గౌరీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కొత్తవలస : బలిఘట్టం అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవాన్ని నిర్వహించారు. కొత్తవలస సెక్టార్ సూపర్వైజర్ కె.రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
వేపాడ : మండలంలోని బొద్దాం అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో వియ్యంపేట ఐసిడిఎస్ పిఒ బి.లక్ష్మీబాయి, సూపర్వైజర్ కామేశ్వరి, అంగన్వాడీలు ఎస్.కె అమ్మాజీ, కె.సత్యవతి, ఎఎన్‌ఎం జి.సంతోషి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
గర్భిణులకు సామూహిక సీమంతాలు
బొబ్బిలి : పట్టణంలోని జంగళవీధి, అగ్రహారంవీధి, చిన్న చెరువుగట్టు, సింగరపువీధి, కుమ్మరివీధి, మంగళవీధి అంగన్వాడీ కేంద్రాలలో గురువారం గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఒ జె.విజయలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు.