రూ.వెయ్యి.. ప్రాణం తీసేలా చేసింది

Jan 8,2025 21:35

పథకం ప్రకారమే హత్య

ఎరుకొండ కేసులో అంగీకరించిన నిందితుడు

ప్రజాశక్తి – పూసపాటిరేగ :  వెయ్యి రూపాయలు కోసం తగాదాయే తన స్నేహితుడు, తన తోటి పనివాడైన గొర్లె పవన్‌కుమార్‌ (22)ను హత్య చేయడానికి కారణమైందని నిందితుడు బొంతు అప్పలనాయుడు పోలీసులు ముందు అంగీకరించినట్లు భోగాపురం రూరల్‌ సిఐ రామకృష్ణ తెలిపారు. ఎరుకొండ హత్యకేసులో నిందుతుడును పట్టుకొని కోర్టుకు తరలిస్తున్నట్లు బుధవారం స్ధానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. నిందితుడు అప్పలనాయుడు, పవన్‌కుమార్‌తో పాటు మరి కొంత మంది కలసి పూసపాటిరేగ చుట్టు పక్కల ఇళ్లకు రంగులు వేస్తుంటారు. రంగలు వేసిన తరువాత కూలీని అప్పలనాయుడు తెచ్చి మిగతా వారికి పంచుతాడు. అలా పవన్‌కు సంబంధించిన రూ. 1000లు అప్పలనాయుడు దగ్గర ఉండిపోయింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో పవన్‌కు కోపం వచ్చి తగాదా పడి అందరి ముందు అప్పలనాయుడును అవమానించాడు. దీంతో ఎలాగైనా పవన్‌ను హత్యచేయాలని అప్పలనాయుడు పథకం పన్నాడు. గోడలకు సున్నాలు గోకుకునే బ్లేడును జేబులో ఉంచుకొని ఈ నెల 5వ తేది రాత్రి మద్యం సేవించారు. గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద రాత్రి 10 గంటలు సమయంలో మరలా ఇద్దరూ ఘర్షణ పడ్డారు. కొంత సేపటి తరువాత అప్పలనాయుడు బైక్‌పై పవన్‌ ఎక్కి వెలుతున్నారు. పవన్‌ తన ఇంటి దగ్గరకు వచ్చే సరికి బైక్‌ నుంచి గెంతేసాడు. ఎందుకు గెంతేసావని అప్పలనాయుడు, పవన్‌కు మధ్య మరలా ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అప్పలనాయుడు పథకం ప్రకారం తెచ్చుకున్న బ్లేడ్‌తో పవన్‌ కడుపులో నాలుగు పోట్లు పొడిచాడు. పవన్‌ కేకలు వేయడంతో వెంటనే పవన్‌ అమ్మ, అమ్మమ్మ బయటకు వచ్చారు. వెంటనే అప్పలనాయుడు అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న అప్పలనాయుడు సమీపంలోని తోటల్లోకి వెల్లిపోయాడు. విశాఖపట్నం వెల్లిపోవాలని ప్రయత్నిస్తుండగా పోలీసులకు దొరికి పోయాడని సిఐ తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ దుర్గాప్రసాదర్‌ ఉన్నారు.

➡️