మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి

Arilova motor wokers general body meeting

 ప్రజాశక్తి – ఆరిలోవ : మోటారు కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటుచేయాలని మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.రెహమాన్‌ కోరారు. హనుమంతువాక స్టాండ్‌ టాటా మ్యాక్సీ డ్రైవర్ల జనరల్‌ బాడీ సమావేశం బుధవారం ముడసర్లోవ పార్కులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌కె రెహమాన్‌ మాట్లాడుతూ, విధి నిర్వహణలో డ్రైవర్లంతా అప్రమత్తంగా ఉండి ప్రయాణికులను గమ్యస్థానాలకు ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా చేర్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మోటార్‌ కార్మికులపై తీవ్రమైన ఆర్థిక భారాలు వేశారని తెలిపారు. జిఒ 21, 31ను తీసుకొచ్చి అపరాధ రుసుముల పేరుతో ఆర్‌టిఎ, ట్రాఫిక్‌ పోలీసులు ద్వారా రూ. వేలల్లో వసూలు చేసున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాల నుంచి పన్నుల వసూలు చేస్తున్నారన్నారు. చెల్లిస్తున్న పన్నుల నుంచి సెస్‌ రూపంలో ఒక పర్సంట్‌ కేటాయించి భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును వారికోసం ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. భారీ స్థాయిలో వసూలు చేస్తున్న రోడ్‌, గ్రీన్‌ ట్యాక్స్‌లను, లేబర్‌ చార్జీ, ఇన్స్యూరెన్స్‌, ఆర్‌టిఎ చలానా చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు పాండురంగ, అధ్యక్షులు కనకరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మణ, సెక్రటరీ రవిశంకర్‌, చిరంజీవి, అప్పలరాజు, ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.

➡️