అభియాన్‌ను పక్కాగా అమలు చేయాలి

ప్రజాశక్తి-రాయచోటి దార్తి ఆబా జన్‌ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్‌ కార్యక్రమాన్ని గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పక్కాగా అమలు అవ్వాలని జెసి ఆదర్శ రాజేంద్రన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయ చోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో నిర్వహించబడే దార్తి ఆబా జన్‌ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్‌ కార్యక్రమంపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ హౌసింగ్‌ పంచాయతీ రాజ్‌ గ్రామీణ నీటి సరఫరా శాఖ విద్యుత్‌ వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్‌ సమావేశాన్ని ప్రారం భిస్తూ జిల్లాలో నాలుగు మండలాలలోని 17 గ్రామాలు ఎంపికయ్యాయని పేర్కొ న్నారు. గ్రామాలలో 50 శాతం పైబడి జనాభా గిరిజనులు ఉన్నట్లుగా జెసికి వివరించారు. ఈ గ్రామాలలో వివిధ శాఖల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ సాయంతో పక్కా ఇళ్ల నిర్మాణం, జల్‌జీవన్‌ మిషన్‌, ఇంటింటికి విద్యుత్తు, సోలార్‌ ప్యానల్‌ నిర్మాణం, జాతీయ హెల్త్‌ మిషన్‌, ఉజ్వల యోజన, పోషణ్‌ అభియాన్‌, సమగ్రశిక్ష, తదితర పథకాలను అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. అనంతరం జెసి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు 50 శాతం పైగా ఉన్న గ్రామాలపై దష్టి సారించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ, మండల స్థాయి కమిటీలు ఎప్పటి కప్పుడూ ఈ కార్యక్రమాలపై సమీక్ష సమావేశాలను నిర్వహించుకొని సంక్షేమ పథకాలు, అభివద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. కొన్ని గ్రామాలలో కొంతమంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అమలు అవ్వని పక్షంలో వారందరికీ సహాయ సహకారాలు అందించి సంక్షేమ, అభివద్ధి ఫలాలను వారికి అందజేయాలన్నారు. అటవీ ప్రాంతం ఉన్న గ్రామాలలో అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే కార్డులు అందని వారికి అందేలా చేయాల న్నారు. కిసాన్‌ సమాన్‌ నిధి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించి గిరిజనుల అభివద్ధికి కషి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️