ప్రజాశక్తి-బేస్తవారిపేట : బేస్తవారిపేట ఏబీఎం చర్చి కాంపౌండ్ పరిధిలోని సీఎన్‌ఎం హైస్కూల్ తెలుగు బాప్టిస్ట్ ఫీల్డ్ చర్చికి సంబంధించిన క్రైస్తవ ఆస్తుల క్రయవిక్రయాలు జరపటం నేరమని, గతంలో చేసిన రిజిస్ట్రేషన్లు చెల్లవని మద్రాస్ హైకోర్టు సిఎస్ నెంబర్ 124/1994లో తీర్పును అప్పట్లో వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం బేస్తవారిపేట రెవెన్యూ పరిధిలోని 41,42,43, 44,45,46, 47,48,49,50 సర్వే నెంబర్లు, పూసలపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 96/1 లలో క్రయవిక్రయాలు జరగకుండా, ఆ స్థలాల్లో ఎటువంటి కట్టడాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని శనివారం కొందరు బేస్తవారిపేట తహశీల్దార్ జితేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ చిలకా చంద్రశేఖర్, గంగవరపు భాస్కర్‌రావు, దయానంద్, భాస్కర్, కంభం ఫీల్డ్ పరిరక్షణ కమిటీ సభ్యులు తోటకూర విక్టర్, చల్లగాలి జోసెఫ్, కువ్వారపు శామ్యూల్, చిట్టెం సైమన్ పీటర్, చల్లగాలి విక్టర్, మట్టేమల్ల రాజేంద్ర, మట్టేమళ్ల దానం తదితరులు పాల్గొన్నారు.
