ఏసీబీ వలలో పరిశ్రమల అధికారి

ప్రజాశక్తి-అద్దంకి: లోను మంజూరు చేయడానికి లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్‌ చేసిన పరిశ్రమల ప్రోత్సాహక అధికారి తన్నీరు ఉమా శంకర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద సంతమాగులూరు గ్రామంలో డైరీ ఫామ్‌ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రెండు లక్షల బ్యాంకు రుణం కోసం వీర్ల రమేష్‌ బాబు పిఎంఈజిపి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు అద్దంకి పట్టణానికి చెందిన మరొకరు కూడా అదేవిధంగా దరఖాస్తు చేసుకున్నారు. అ యితే దరఖాస్తులను ప్రాసెస్‌ చేయడానికి బాపట్ల జిల్లా పరిశ్రమల కేంద్రం పరిశ్రమల ప్రోత్సాహక అధికారి తన్నీరు ఉమా శంకర్‌ ఒక్కొక్క దరఖాసుదారుడు నుంచి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.40 వేలు డిమాండ్‌ చేయగా వీరికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కెఅండ్‌కె కన్సల్టెన్సీ ఆఫీసు వద్ద మంగళవారం కమ్మ కిషోర్‌ బాబు అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఉమా శంకర్‌ లంచం డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని బుధవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఏసీబీ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ జిల్లా అధికారులకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా కానీ మొబైల్‌ 94404 40057 ద్వారా తెలియజేయాలని కోరారు.

➡️