పారిశుధ్య పనులు వేగవంతం

ప్రజాశక్తి-కొండపి: కొండపిలో పారిశుధ్య పనులు వేగం పుంజుకున్నాయి. గత వైసిపి ప్రభుత్వంలో కొండపిలో రోడ్డు మీద వర్షపు నీరు తొలగించలేకపోయారు. ఎంతోమంది బాటసారులు, ద్విచక్ర వాహనదారులు, దుకాణాదారులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు కాని, నాయకులు కాని కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. టిడిపి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలలోనే కొండపిలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని పారిశుధ్య పనులపై దృష్టి సారించారు. ఇటీవల కురుస్తున్న తేలికపాటి వర్షాలకు పోలీసు స్టేషన్‌ ముందు ఆర్‌అండ్‌బి రోడ్డుపై వర్షపు నీరు నిలిచి చిన్నపాటి చెరువును తలపించింది. దీంతో గ్రామస్తు లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు సైతం రావడానికి వీలులేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం నియోజకవర్గంలోని కొండపికి వచ్చిన రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి రోడ్డులో నిలిచిన వర్షపు నీటిని పరిశీలించి తక్షణమే నీరు పోయే చర్యలు తీసుకోవాలని అదికారులకు సూచించారు. గతంలో ఆయా రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువలు నిర్మించి ఉండటాన్ని ఆయన వారికి గుర్తుచేశారు. తక్షణమే అక్రమణదారులు వేసిన మట్టిని తొలగించి గతంలో ఉన్న డ్రైనేజీ కాలువను పునరుద్ధరిం చాలని అధికారులకు పురమాయించారు. మంత్రి ఆదేశాలు అందుకున్న అధికారులు ఆదివారం డ్రైనేజీ కాలువ పనులు మొదలుపెట్టారు. జెసిబి సహాయంతో డ్రైనేజీపై ఉన్న మట్టిని తొలగించి ట్రాక్టర్ల సహాయంతో బయటకు తరలించారు. ఆయా పనులను మంత్రి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బి డిఈ మాధవరావు, అధికారులు, స్థానిక నాయకులు ఉన్నారు.

➡️