పక్కాగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు

Apr 3,2024 21:49

ప్రజాశక్తి పార్వతీపురం రూరల్‌ : వ్యాధి నిర్ధారణ పరీక్షలు పక్కాగా నిర్వహించి, నివేదికలు సకాలంలో అందజేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంఒ ఆధ్వర్యంలో ల్యాబ్‌ టెక్నీషియన్లకు నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి ప్రతి రోజూ ఆరోగ్య పరీక్షల కోసం వస్తున్న వారికి, క్షేత్ర స్థాయిలో చేపడుతున్న సర్వేలెన్స్‌లో జ్వర లక్షణాలున్న వారికి సేకరించిన రక్తపూతల నమూనాలను సకాలంలో పరీక్షించి, నివేదికలు వెంటనే తెలియజేయాలన్నారు. వివరాలు ల్యాబ్‌ రికార్డులో ఎప్పటికప్పుడే నమోదు చేయాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ నిర్దారణ అయితే ఐహెచ్‌ఐపి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదుచేయాలని సూచించారు. తద్వారా క్షేత్ర స్థాయి సిబ్బంది ఆ ప్రదేశంలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హెల్త్‌ అసిస్టెంట్స్‌, హెల్త్‌ సూపర్‌వైజర్ల సందర్శనల వివరాలతో నెలవారీ ప్రణాళికను (టూర్‌ డైరీ) కార్యాలయానికి అందించాలని చెప్పారు. ప్రాంతీయ, జిల్లా, కమ్యూనిటీ హెల్త్‌ ఆసుపత్రిలో గానీ, పక్క జిల్లాలో గానీ మలేరియా, డెంగీ నిర్ధారణ అయితే ఆ వివరాలు ఎంఎఫ్‌7 రికార్డులో నమోదు చేయాలన్నారు. ప్రతి పిహెచ్‌సిలో ఆక్టివ్‌ (క్షేత్ర స్థాయిలో), పాసివ్‌ (ఆసుపత్రిలో) బ్లడ్‌ శాంపిల్స్‌ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. ఎం4, ఎంఎఫ్‌7, ఎంఎఫ్‌9 ల్యాబ్‌ రికార్డులను పక్కాగా నిర్వహించి, వారాంతపు, నెలవారీ నివేదికలు సకాలంలో డిఎంఒ కార్యాలయానికి అందించాలని ఆదేశించారు. ఫైలేరియా నైట్‌ బ్లడ్‌ సర్వేలో సేకరించిన రక్త పూతలను ల్యాబ్‌లో సకాలంలో పరీక్షించి, నివేదికలు తెలియజేయాలన్నారు. ఆస్పత్రుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్ల పాత్ర కీలకమని, ల్యాబ్‌ నిర్వహణ పటిష్టంగా ఉన్నప్పుడే వ్యాధుల పట్ల ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయవచ్చని కోరారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, జిల్లా విబిడి కన్సల్టెంట్‌ రామచంద్ర, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారులు, ఇఒ నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

➡️