ప్రజాశక్తి – పెనుగంచిప్రోలు (ఎన్‌టిఆర్ జిల్లా) : ఎన్‌టిఆర్ జిల్లాలో వైసిపి నాయకుడిపై శనివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. ఆయనపై కొందరు ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపడిచారు. ఈ సంఘటన పెనుగంచిప్రోలు మండలం కొనకంచి అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పెనుగంచిప్రోలు మండల వైసిపి నాయకుడు, నవాబుపేట గ్రామ మాజీ ఉప సర్పంచ్ గింజుపల్లి శ్రీనివాస్ తన సొంతపని నిమిత్తం బయటకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వస్తూ టిఫిన్ చేసేందుకు కొణకంచి అడ్డరోడ్డు 65వ నెంబర్ జాతీయ రహదారి వద్ద ఆగారు. అదే సమయంలో అక్కడే మాటువేసిన నవాబుపేట గ్రామానికి చెందిన కొందరు టిడిపి నాయకులు ఒక్కసారిగా శ్రీనివాస్‌పై దాడి చేశారు. కిందపడిపోయినా వదలకుండా కర్రలతో కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను స్థానికులు విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. 2009లో శ్రీనివాస్ తండ్రి గింజుపల్లి వీరయ్యను టిడిపి నాయకులే గ్రామ శివాలయంలో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. ఆ కేసులో నిందితులైన టిడిపి నాయకులే శ్రీనివాస్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. శ్రీనివాస్ గ్రామంలోనే కాకుండా జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే కీలకమైన నేతగా, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు అనుచరుడిగా ఉన్నారు. శ్రీనివాస్‌పై హత్యాయత్నం నేపథ్యంలో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
Attack : పెనుగంచిప్రోలులో మాజీ ఉప సర్పంచ్‌పై హత్యాయత్నం
