ప్రజాశక్తి-లక్కవరపుకోట : ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకో గలమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు, స్కూల్ ఆయాల సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ. పెట్టుబడిదారులకు చుట్టాలుగా ఈ రాజకీయ నాయకులు తయారయ్యారని, దేశాన్ని దోచుకునే దొంగలకు మోడీ కొమ్ముకాస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఏళ్ల తరబడి పోరాటాలు చేస్తున్నప్పటికీ మోడీ స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు. తిరపతి లడ్డూపై ఉన్న శ్రద్ధ కార్మికుల హక్కుల కాపాడడంలోనూ,వారి సమస్యల పరిష్కారంలోనూ లేదన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడేది పారిశుధ్య కార్మికులేనని, ప్రభుత్వాలు గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి అప్పారావు, సిఐటియు మండల అధ్యక్షులు వెంకటరమణ, సిఐటియు నాయకులు చెలికాని ముత్యాలు పారిశుద్ధ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, స్కూల్ సీపర్లు పాల్గొన్నారు.