ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ (అన్నమయ్య జిల్లా) : యువతిపై కత్తి, యాసిడ్ దాడికి తెగబడిన ఉన్మాదిని గంటల వ్యవధిలో పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడికి కచ్చితంగా శిక్ష పడుతుందని ఎస్‌పి విద్యాసాగర్‌నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె డిఎస్‌పి కార్యాలయంలో నిందితుడు గణేష్‌ను మీడియా ఎదుట శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఎస్‌పి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. యువతిపై యాసిడ్ దాడి, ఆపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని తెలిపారు. మదనపల్లె పట్టణంలోని వైఎస్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న శంకారపు గణేష్, గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లికి చెందిన యువతి మదనపల్లిలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి ప్రేమ పేరుతో యువతిని గణేష్ వేధించేవాడని, ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలో ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో యాసిడ్ నోట్లో పోసే ప్రయత్నం చేయడంతో ఆమె ప్రతిఘటించగా ముఖంపై చల్లాడన్నారు. తరువాత కత్తితో ఆమె మెడ, గొంతు, చేతులపై దాడి చేశారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు సంఘటన జరగ్గా.. బెంగుళూరుకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న నిందితుడిని మధ్యాహ్నం 3 గంటల సమయంలో చాకచక్యంగా పట్టుకున్నామని తెలిపారు.
