మాట్లాడుతున్న కలెక్టర్ నాగలక్ష్మి
ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని రిటర్నింగ్ అధికారి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనెల 3 నుండి 10వ తేదీ వరకూ పని దినాల్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. 11వ తేదిన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, నామినేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 3 గంటల వరకూ గడువని తెలిపారు. 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. శాసనమండలి ఎన్నికలు బ్యాలెట్ పేపరుపై, ప్రాధాన్యతా ఓటు విధానంలో జరుగుతుందని, కావున స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆరు జిల్లా పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికా రిగా గుంటూరు కలెక్టర్, ఎఆర్‌ఒలుగా ఆయా జిల్లాల డిఆర్‌ఒలు ఉంటారని, ఏలూరుకు మాత్రం పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎఆర్‌ఒగా వ్యవహరిస్తారని వివరించారు. జనవరి 30వ తేది నాటికి ఉన్న జాబితా ప్రకారం ఓటర్లు పురుషులు 2,06,176 , మహిళలు 1,40,307 , ట్రాన్స్ జెండర్స్ 46 మంది మొత్తం 3,46,529 మంది ఉన్నారన్నారు. ఆ తర్వాత స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 10వ తేదీ నాటికి తుది జాబితాలో చేరుస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో 416 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఓటర్లు ఎక్కువుగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు 67 ఆగ్జలరీ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు ఇచ్చామని, అనుమతులు వస్తే 483 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులో ఉంటుందని, పట్టభద్రులను ప్రభావితం చేసే ఎటువంటి కార్యక్రమాలనూ నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పర్యవేక్షణకు మండలానికి ఒకటి, నగరాల్లో జనాభాకు అనుగుణంగా ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు నగదు పంపిణీ చేయటం, ప్రలోభాలకు గురిచేయటం, బెదరించటం వంటివి చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ప్రచారానికి సంబంధించి సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. సంబంధిత జిల్లాలలోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులే అనుమతులు మంజూరు చేస్తారన్నారు. సింగిల్ విండో ద్వారా ధరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తారన్నారు. టీవీ, రేడియో, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచార కంటెంట్‌కు సంబంధించి ఎంసీఎంసీ కమిటీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ ఖాజావలి పాల్గొన్నారు.
