ఆశా వర్కర్‌ను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి

Mar 13,2025 00:25

సామ్రాజ్యంను పరామర్శిస్తున్న ధనలక్ష్మి ఇతర నాయకులు, ఆశాలు
ప్రజాశక్తి-గుంటూరు :
పల్నాడు జిల్లా, అమరావతి మండలం, ఉంగుటూరుకు చెందిన ఆశావర్కర్‌ రాయపాటి సామ్రాజ్యంను రాజకీయ వేధింపులకు గురి చేసి, అత్మహత్యాయత్నానికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్‌ను ధనలక్ష్మి బుధవారం పరామర్శించారు.వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం ధరలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగుల విధి నిర్వహణలో ఏవైనా లోపాలుంటే సరైన పద్ధతిలో సరిదిద్దే ప్రయత్నం చేయాలిగానీ రాజకీయ కారణాలతో తొలగించాలని వేధింపులకు పాల్పడటం సరికాదన్నారు. విచారణ సమయంలో వందలాది మందితో పిహెచ్‌సి వద్దకు వచ్చి తొలగించాలని ఒత్తిడి చేశారని, దీంతో వందల మంది అధికార పార్టీకి చెందిన వారిని చూసి ఏమి చేయాలో తెలియక ఆశా వర్కర్‌ సాంమ్రాజ్యం ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రాజకీయ వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు మారినప్పుడుల్లా ప్రజలకు వివిధ శాఖల ద్వారా సేవలు అందిస్తున్న చిరు ఉద్యోగులపై వేధింపులు సరికాదని అన్నారు. చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్న వారి సమస్యలపై మాట్లాడలేని వారు తొలగించానికి పూనుకోవడం, దారుణంగా బెదిరింపులకు పాల్పడడం దారుణమని అన్నారు. రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఆశాలకు పిలుపునిచ్చారు. సాంమ్రాజ్యంను పరామర్శించిన వారిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా నాయకులు జి.రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి డి.శివకుమారి, గుంటూరు జిల్లా కార్యదర్శి కె.లక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, అమరావతి మండల కార్యదర్శి బి.సూరిబాబు, నాయకులు బి. ముత్యాలరావు బి.లక్ష్మణరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పంతగాని ధనలక్ష్మి, కె.జ్యోతి, రేణుక, ప్రమీల, సుమతి, నాగమణి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సమీర్‌ ఉన్నారు.

ప్రజాశక్తి-సత్తెనపల్లి :
కూటమి ప్రభుత్వం పాలనలో స్కీమ్‌ వర్కర్లపై రాజకీయ వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, వీటిని మానుకోవాలని సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు మల్లీశ్వరి డిమాండ్‌ చేశారు. రెండ్రోజుల కిందట నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంలో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్య, అమరావతి మండలం ఉంగుటూరులో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో ఇందకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్తెనపల్లి పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో మల్లీశ్వరితోపాటు ఐద్వా పట్టణ కార్యదర్శి జి.ఉమశ్రీ, సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎ.వీరబ్రహ్మం మాట్లాడారు. రాజీనామా అయినా చేయండి లేకుంటే మేమైనా రాజీనామా చేయించి మా పార్టీకి చెందినవారిని పెట్టుకుంటాం అనే రీతిలో కూటమి నాయకులు బహిరంగంగా స్కీమ్‌ వర్కర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు. వేధింపులు మానుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్‌ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జి.మస్తాన్‌రావు, జి.రజిని, డి.విమల, సుధా, ఆయోష, జి.నాగలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక బంగ్లా సెంటర్‌ నుండి అంబేద్కర్‌ బొమ్మ వరకు ర్యాలీ గురువారం నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయ వేధింపుల వల్ల చనిపోయిన అంగన్వాడి షేక్‌ ఫాతిమా కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అమరావతి మండలంలో రాజకీయ ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం చేసిన సామ్రాజ్యం కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ పిడుగురాళ్ల ప్రాజెక్టు కార్యదర్శి డి.శాంతమణి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సమస్యలపై 42 రోజుల సమ్మె జరిగే టిడిపి కూటమి నాయకులు సమ్మె శిబిరం దగ్గరకు వచ్చి మద్దతిచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి స్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే వారే నేడు మా పొట్టగొడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. నిరసనకు ఐద్వా నాయకులు ఎస్‌.దుర్గాబాయి సంఘీభావం తెలపగా నాగమణి, అరుణ, వాణి, జ్యోతి, బుజ్జి, ఆనంద కుమారి, భారతి, భిక్షాయి, వెంకటలక్ష్మి, శైలజ, చంద్ర, లక్ష్మి, షేక్‌ బాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-చిలకలూరిపేట : స్థానిక పండరిపురంలో నిరస తెలపగా సిఐటియు మండల కన్వీనర్‌ పేరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడారు. వేధింపులను మానుకోకుంటే గత ప్రభుత్వాలు పట్టిన గతే ఇప్పటి ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సావిత్రి, పద్మ, ఆశా వర్కర్స్‌ నాయకులు కె.మరియ పి.శ్రీదేవి, రాజేశ్వరి, ఐద్వా నాయకులు పి.భారతి, సిఐటియు నాయకులు రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️