ప్రజాశక్తి – పాచిపెంట : మండలంలోని పేదల భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై చర్యలు తీసుకొని వారికి భూములు అప్పజెప్పాలని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, జిల్లా నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎన్‌వై నాయుడు, కె.ఈశ్వరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలంలోని మోసూరులో రెండు దశాబ్దాల కిందట గ్రామంలో కొంతమంది పేదలకు రెండెకరాల చొప్పున ప్రభుత్వ భూమి డి-పట్టాలు ఇచ్చిందన్నారు. ఈ భూముల్లో తుప్పలు, డొంకకొట్టి పెద్ద పెద్ద గుమ్ములను సరిచేసి సాగులో ఉన్నటు వంటి భూములను ఆ గ్రామ పెత్తందారులైన మాజీ వైస్ ఎంపిపి, వైసిపి నాయకులు రాజకీయ అండదండలతో పేదలను బెదిరించి భూములను అన్యాక్రాంతం చేశారని అన్నారు. ఆ భూములు కావాలని ముందుకెళ్లిన పేదలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించి చంపుతామని భయపెడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు స్పందించి పరిష్కరించాలని, చట్టపరంగా అన్యాక్రాంతమైన భూములను పేదలకు అప్పగించాలని, బయటకు రావడానికి కూడా భయపెట్టేలా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికిఎంతైనా ఉందని అన్నారు. డి పట్టా భూములను అమ్మడానికి, కొనడానికి లేదని, అలా చేసిన వారికి శిక్షార్హులన్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పేరున వన్ బి, బ్యాంకు లోన్లు కూడా ఉండి సంపూర్ణమైన హక్కులు కలిగి ఉన్నారని, అధికారులు చట్టపరమైన కేసులు పెట్టి ఎవరి భూమి వారికి అప్పగించాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిని అందించారు. దీనికి డిటి స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలకు న్యాయం చేస్తామని, కలెక్టర్ స్థాయిలో ఈ సమస్య తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ చేస్తామని సిపిఎం నాయకులు హెచ్చరించారు.