ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : కలెక్టర్, ప్రజాప్రతినిధుల సహకారంతో ఒంగోలు నగర పాలక సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌గా కె.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం కమిషనర్ పారిశుధ్య పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం 5.30లకు, మధ్యాహ్నాం మస్టర్ వేయాలని, ఆ వివరాలను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయాలన్నారు. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని, నగరంలో ఎక్కడా అపరిశుభ్రత ప్రాంతాలు కనిపించకూడదని ఆదేశించారు. పారిశుధ్య అధికారులు, సిబ్బంది పారిశుధ్యం మెరుగుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డ్ శానిటేషన్, ఎన్విరాన్‌మెంటల్ సెక్రటరీలు పాల్గొన్నారు.
