మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌పి సతీష్‌కుమార్, వెనుక నిందితుడు కిరణ్‌కుమార్
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టినా, వాటిని ఫార్వార్డ్ చేసినా చర్యలు తప్పవని గుంటూరు జిల్లా ఎస్‌పి సతీష్‌కుమార్ హెచ్చరించారు. మాజీ సిఎం వైఎస్ జగన్ భార్య భారతీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను అరెస్టు చేసి గుంటూరులోని తన కార్యాలయంలో గురువారం సాయంత్రం మీడియా ఎదుట ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కిరణ్‌పై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయన్నారు. గుంటూరు నగరానికి చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ రామన్నపేటలో నివాసం ఉంటూ టిడిపిలో ఐటి విభాగంలో పనిచేస్తున్నాడని, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యాలు చేశాడని అన్నారు. దీనిపై మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామానికి చెందిన బంగు వెంకట కృష్ణారెడ్డి, సంగేవు వెంకట శివరామకృష్ణ మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ పారిపోతున్న చేబ్రోలు కిరణ్ కుమార్‌ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇబ్రహీంపట్నం సమీపంలోని కీలేసపురం వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు. మాజీ మంత్రి విడదల రజని, పలువురు వైసిపి నాయకులపై అనుచిత పోస్టింగ్‌లు పెట్టినందుకు వివిధ ప్రాంతాల్లో కిరణ్‌పై కేసులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నార్త్ డిఎస్‌పి మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్ పాల్గొన్నారు.
