ప్రజాశక్తి – గాజువాక : తన కలం, గళంతో సమాజాన్ని మేల్కొలిపిన గొప్ప వ్యక్తి ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు, రచయిత జి.సన్యాసిరావు అని పలువురు వక్తలు కొనియాడారు. గాజువాక లయన్స్ క్లబ్‌లో సన్యాసిరావు సంస్మరణ సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ ప్రజా గాయకునిగా, రచయితగా సన్యాసిరావు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన కడ వరకూ ఉద్యమంతో మమేకమై ఉన్నారని తెలిపారు. అచ్యుతాపురంలో ప్రజలు భూములు కోల్పోయినప్పుడు, రైతులు, నిర్వాసితులు సమస్యలపైనా తాను అప్పట్లో పోరాటాలు చేయగా పది రోజులపాటు తనతో వీధి వీధినా తిరిగి పాటలతో అందరిలో చైతన్యం నింపారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అచ్యుతాపురం సెజ్‌లో యూనియన్ పెట్టగలిగేమంటే ఆ రోజు సన్యాసిరావు ఆ పోరాటంలో పాటలు పాడడమే కారణమన్నారు. పాటలే ఊపిరిగా బతికారని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ సన్యాసిరావు ధన్యజీవి అన్నారు. ప్రతి ఉద్యమంలోనూ ఆయన పాట ఉందన్నారు. ప్రభుత్వాలు కార్మికులపై దాడులకు దిగినప్పుడు సన్యాసిరావు తన కలం, గళంతో కార్మిక ఉద్యమాలకు ఉత్తేజాన్ని ఇచ్చారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ సన్యాసిరావు ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి అని తెలిపారు. ఉద్యమ ధ్యాస తప్ప ఆయనకు మరో ఆలోచన లేదన్నారు. పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే.. తపన, పట్టుదల ఉంటే చాలు.. అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించిన గొప్ప వ్యక్తి సన్యాసిరావు అన్నారు. సమ సమాజ స్థాపన లక్ష్యం కోసం నిరంతరం పనిచేశారని తెలిపారు. ఆయనకు కుటుంబం నుంచి ఎనలేని సహకారం అందిందని తెలిపారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు మంగరాజు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో సన్యాసిరావు పాత్ర గొప్పదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ అత్యున్నత కళాకారుడు సన్యాసిరావు అని. ఆయన బుర్ర పాదరసం వంటిదని అన్నారు. సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్, ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, సిఐటియు జిల్లా నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు టి.శ్రీరామమూర్తి, ఎంసిపిఐ నాయకులు పట్నాయక్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు జి.రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, సన్యాసిరావు కుమారులు స్టాలిన్, సత్య సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా సన్యాసిరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. సన్యాసిరావుపై ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను నాయకులు ఆవిష్కరించారు. సన్యాసిరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు 600 మొక్కలను పంపిణీ చేశారు.