బిసి, ఎస్‌సిలకు రూ.50వేలు, ఎస్‌టిలకు రూ.75 వేలు
పివిటిజిలకు ఒక్కో ఇంటికి రూ.1 లక్ష వంతున సహాయం
జిల్లాలో 15,226 మందికి లబ్ది
ప్రజాశక్తి-విజయనగరం : ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్, అర్బన్, పి.ఎం.జన్‌మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందించి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతోందని చెప్పారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయం వల్ల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, పివిటిజిలకు చెందిన 15,226 మంది ఇళ్ల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 12,240 మంది బిసిలకు, 2,231 మంది ఎస్‌సిలకు ఒక్కో ఇంటికి రూ.50 వేల వంతున ఆర్ధిక సహాయం అందిస్తారని తెలిపారు. 565 మంది షెడ్యూల్డు తెగల వారికి రూ.75 వేలు వంతున, 190 మంది ఆదిమతెగల వారికి పిఎం జన్‌మన్ కింద ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.1 లక్ష వంతున ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. లబ్ధిదారులు తమకు మంజూరైన ఆర్ధిక సహాయం వినియోగించుకొని ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసుకోవాలన్నారు. గతంలో మంజూరై నిర్మాణంలో వున్న ఇళ్లకు మాత్రమే ఈ అదనపు ఆర్ధిక సహాయం వర్తిస్తుందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఇంజనీరింగ్, సంక్షేమ కార్యదర్శులు ఈ నెల 18 నుంచి 22 వరకు ఇళ్ల నిర్మాణాల వద్దకు వెళ్లి వాటిని ఫోటోలు తీసి హౌసింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారని చెప్పారు.