అదనపు సాయం లబ్ధిదారునికి అందాలి

ప్రజాశక్తి-రాయచోటి పూర్తయిన పల్లెపండుగ పనులను ఉగాది రోజున ప్రారంభించాలని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాల వారికి ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న అదనపు ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు, హౌసింగ్‌ శాఖ సిబ్బంది, విఆర్‌ఒలు, సర్వే సిబ్బంది, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పిజి ఆర్‌ఎస్‌ ద్వారా అందిన అర్జీలు, రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన అర్జీలు, రీసర్వే, ఇళ్ల పట్టాల రీ వెరిఫికేషన్‌, పల్లెపండుగ కార్యక్రమాలు, ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌, పి4 సర్వే అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల రీ వెరిఫికేషన్‌ ప్రక్రియ పక్కాగా జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 17 రకాల అంశాలను ఆధారంగా చేసుకొని అనర్హులను తీసివేయాలని చెప్పారు. అర్హులకు మాత్రమే ఇళ్ల పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. పిజిఆర్‌ఎస్‌ ద్వారా అందిన అర్జీలు రెవెన్యూ సదస్సుల ద్వారా అందిన అర్జీలపై సమీక్షిస్తూ అర్జీలను త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమాలు, నరేగా పనుల పై సమీక్షిస్తూ దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయని ఎంపిడిఒలు అందరూ మంచి పురోగతి సాధించారని అభినందించారు. పూర్తయిన పల్లె పండుగ పనుల ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని, వారిని ఆహ్వానించి ఉగాది రోజున ప్రారంభించాలని సూచించారు. ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ పథకంలో ఇళ్ల నిర్మాణాలపై సమీక్షిస్తూ ఎస్‌సి, ఎస్‌టి,బిసి వర్గాలకు ఇస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకొని ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పి-4 సర్వే పై సమీక్షిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభల నిర్వహణ అనంతరం ఆర్థిక పిరమిడ్‌లో దిగువన ఉన్న 20 శాతం లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, డిఆర్‌ఒ మధుసూదనరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఒలు, హౌసింగ్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️