ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : టూరిజం అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నం తక్షణం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు,అధికారులు మానుకోవాలని ఆదివాసి జేఏసీ జిల్లా నాయకులు వంతు బాలకృష్ణ పెసా కమిటీల మండల అధ్యక్షులు తాము సూరిబాబు పలువురు జేఏసీ నేతలు శుక్రవారం డిమాండ్ చేశారు. మండలంలోని నెల్లిమెట్ల గ్రామంలో జేఏసీ నాయకులు వంతు బాలకృష్ణ అధ్యక్షతన ఆదివాసి జేఏసీ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జేఏసీ నేతలు వంతు బాలకఅష్ణ,తాము సూరిబాబు,తదితరులు మాట్లాడుతూ.ఈనెల9న రంపచోడవంలో ఐటిడిఎ వర్క్‌షాపు నిర్వహించిందని,టిడిపి ఎమ్మెల్యే,వైసిపి ఎమ్మెల్సీ, అలాగే అధికార పార్టీ నాయకులతో మాట్లాడించి ఒక నోట్ తయారు చేసి విడుదల చేసినట్లు చెప్పారు. అభివద్ధి,టూరిజం మాటున ఏజన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడమే దీని వెనుకనున్న మర్మమన్నారు.ఈ ప్రక్రియ గత రెండు మూడు నెలల నుంచి కొనసాగుతుందన్నారు. గతంలో శాసన సభ స్పీకర్ అయన్నపాత్రుడు 1/70 చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం,గత శాసన సభ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేతో గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాని కోరుతూ ప్రకటన చేయించడం,తాజాగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ టూరిజం ప్రోత్సహించాలని చేసిన వాఖ్యలు ఇందులో భాగమేనన్నారు.గత ఎన్నికల్లో గిరిజన చట్టాలను,హక్కులకు, జీవోలకు ఎటువంటి హాని తలపెట్టకుండా వాటిని గౌరవిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు ఏజెన్సీ ప్రాంతాల్లో గనులు అటవీ భూములు ఉత్పత్తులు సుగంధ ద్రవ్యాలు వంటి సహజ వనరు టూరిజం పేరుతో ప్రైవేట్ సంస్థలకు ద్వారా దత్తం చేయడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆదివాసి గిరిజన సంఘం ప్రతినిధులు అంతా టూరిజం అభివృద్ధి పేరుతో 1/70చట్టాన్ని ఉల్లంఘన పై తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందన్నారు. ఏజెన్సీలోని అపారమైన సహజ వనరులు ప్రైవేట్ పెట్టుబడిదారులకు సంస్థలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.చదువుకునే గిరిజన యువతకు టూరిజం అభివఅద్ధి చెందితే హౌటల్స్ లో,బార్లు లో ఉద్యోగాలు గిరిజనులకు వస్తాయని చెప్పడం అర్ధరహితం అన్నారు.అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఆదివాసీలకు కల్పించిన రాజ్యాంగ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని,పెసా చట్ట ప్రకారం గ్రామసభలు నిర్వహించి గిరిజనుల అభిప్రాయలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గిరిజన ప్రాంతంలోకి కార్పొరేట్ సంస్థలను అనుమతించి భూగర్భ సంపద కొల్లగొట్టుకు పోయే విధానాలను గిరిజన ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ నేతలు ఈక నాగరాజు, నైని సత్తిబాబు,బరగా ప్రసన్నకుమార్,పూసం పండరీనాథ్,ఈకా పవన్ కుమార్,జర్తా నూకరాజు, ఈక శివ,ఈక రాజారావు, పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలి : ఆదివాసి జేఏసీ డిమాండ్
