పాఠశాలల్లో అడ్మిషన్‌ డ్రైవ్‌

Apr 16,2025 21:25

ప్రజాశక్తి-పార్వతీపురం : పాఠశాలల్లో అడ్మిషన్‌ డ్రైవ్‌ ప్రారంభించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌.. విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో అడ్మిషన్లు, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థుల విద్య, ఆరోగ్య స్థాయిలను గూర్చి కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఉంటున్న చిన్నారులు అందరూ ఒకటో తరగతిలో విధిగా చేర్చాలని ఆయన ఆదేశించారు. ఏ ఒక్క విద్యార్థి పాఠశాలలో చేరకుండా ఉండరాదని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా బయట ఉన్న చిన్నారులను సైతం గుర్తించి చేర్చాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 19న వీడ్కోలు కార్యక్రమం జరుగుతుందని, 21వ తేదీ నాటికి పిల్లలు అందరూ పాఠశాలల్లో ఉండాలని చెప్పారు. గత ఏడాది ఒకటో తరగతిలో 10,932 మంది చేరారని, దాదాపు అదే స్థాయిలో విద్యార్థులు ఈ ఏడాది చేరాలని ఆదేశించారు. ఏడో తరగతి నుండి 8వ తరగతి, 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ లేదా ఇతర కోర్సుల్లో చేరే విద్యార్థులపైనా దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 9,200 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. బడి బయట వివిధ కారణాల వల్ల ఉన్నవారి వివరాలు సంపూర్ణంగా సేకరించాలని, వారి విద్యా పరిస్థితులు తెలుసుకోవాలని కలెక్టర్‌.. అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలలో తప్పిన వారిని వెంటనే సప్లిమెంటరీ పరీక్షలకు పంపించాలని, ఇందుకు మండల విద్యా శాఖ అధికారులు బాధ్యత వహిస్తారని తెలిపారు. విద్యలో ఉన్నత అర్హతలున్న ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. పోటీ పరీక్ష్లలో విజయం సాధించి ఉద్యోగాలు పొందారని, అదే స్ఫూర్తితో మంచి ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వయస్సుకు తగిన బరువు, పెరుగుదల ఉండాలి అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల బరువు పెరుగుదల వయస్సు తగిన విధంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఏ అంగన్వాడీ కేంద్రంలోనైనా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చిన్నారుల బరువు, పెరుగుదల ఉండదో అందుకు సూపర్వైజర్లు బాధ్యత వహిస్తారని స్పష్టం చేశారు. బాగా పనిచేయని సూపర్వైజర్లు ఉండాలా? సస్పెండ్‌ చేయాలా? అనేది తేల్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం తీసుకుంటున్నా సరైన వృద్ధి లేనప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, సంబంధిత వైద్యాధికారులను సంప్రదించాలని ఆదేశించారు. గుమ్మ, సీతంపేట ప్రాంతంలో నిర్దేశిత ప్రమాణాలకు తగిన విధంగా చిన్నారుల పెరుగుదల, బరువు కనిపించడం లేదని, దీనిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడీ చిన్నారులను పాఠశాలలో చేర్పించుటకు అవసరమైన ఆధార్‌ కార్డు నమోదును 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. బాల్య వివాహాలు జరగరాదన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. 2 నెలల్లో జనన ధ్రువపత్రాలు శిశువు జన్మించిన రెండు నెలల్లో జనన ధ్రువీకరణ పత్రాలను పంచాయతీ కార్యదర్శి జారీ చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎక్కడైనా జనన ధ్రువపత్రాలు జారీ కాకుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నిర్వహణ కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారి టి.కనకదుర్గ, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా అధికారి డి.మంజులవీణ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారి ఎన్‌.కృష్ణవేణి, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్‌, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఇ.అప్పన్న, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్‌.రాజేశ్వర రావు, సిడిపిఒలు, డిప్యూటీ డిఇఒలు, ఎంఇఒలు తదితరులు పాల్గొన్నారు.

➡️