ప్రజాశక్తి – రాయచోటి టౌన్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని కోరుతూ బుధవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురళీమోహన్ రాజు ఆధ్వ ర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా సమగ్ర శిక్ష ఉద్యోగుల బతుకులు మారడం లేదని స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, స్కిల్ వర్కర్స్, స్కీమ్ వర్కర్స్, పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్స్ అనే రకరకాల పేర్లతో ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని అనేకసార్లు నాయకులు అధికారులతో మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు. ఇప్పటికైనా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పర్మినెంట్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇపిఎఫ్ వంటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు సి రవికుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కార్యదర్శి షేక్ అలీ హుస్సేన్, సభ్యులు ప్రదీప్ కుమార్, రెడ్డి లక్ష్మి, సాబీరున్, సమియున్ పాల్గొన్నారు.