ప్రజాశక్తి -గోపాలపట్నం : ఎన్‌ఎడి యాజమాన్యం చర్చలకు పిలిచి ఆరుగురిపై పోలీసు కేసు, 36 మందిని సస్పెండ్ చేయడాన్ని అఖిలభారత రక్షణ ఉద్యోగుల ఫెడరేషన్ (ఎఐడిఇఎఫ్) ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం మంగళవారం వచ్చిన శ్రీకుమార్ ఎన్‌ఎడి గేటు వద్ద ఉన్న దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. దీక్షలో కూర్చున్న కార్మికులను, సస్పెన్షన్‌కు గురైన నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారు. ఫెడరేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత కొంత కాలంగా రక్షణ రంగ ఉద్యోగులపై ఆయా యాజమాన్యాలు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నాయని, వీటిని ఎదుర్కొని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిలబడిందని, ఇటువంటివి ఫెడరేషన్‌కు కొత్త కాదని శ్రీకుమార్ తెలిపారు. అనంతరం 11 గంటలకు ఎన్‌ఎడి చీఫ్ జనరల్ మేనేజర్ దివాకర్ జయంతిని కలిసి మాట్లాడారు. ఈ రోజే చార్జిషీట్లు ఇచ్చినందున సస్పెన్షన్లను ఎత్తివేయాలని కోరారు. పరిశ్రమ ఉత్పత్తి కార్యకలాపాలకు ఇంతమందిని దూరంగా ఉంచడం మంచిది కాదని చెప్పారు. నేవల్ బేస్‌లో చీఫ్ సివిలియన్ పర్సనల్ ఆఫీసర్ రారును కలిసి ఎన్‌ఎడి పరిణామాలను వివరించారు. ఇచ్చిన ఛార్జిషీట్లుపై విచారణకు సహకరిస్తామని, సస్పెన్షన్లు ఎత్తివేసేలా చూడాలని కోరారు. జరిగిన పరిణామాలను ఫ్లాగ్ ఆఫీసర్‌కు వివరించి ఎన్‌ఎడిలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు చేసిన ఓటీకి పేమెంట్లు జరిగేలా బాధ్యత తీసుకోవాలని కమాండ్ అధికారులను శ్రీకుమార్ కోరారు. సస్పెన్షన్లు ఎత్తివేసేవరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. పోరాటానికి అఖిల భారత స్థాయిలో అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని ఎన్‌ఎడి కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ రక్షణ రంగ, ఎన్‌ఎడి అధికారులతో చర్చలు జరపడంతో పాటు కార్మికులకు మనోధైర్యాన్ని ఇచ్చిన శ్రీకుమార్‌కు ఎన్‌ఎడి యూనియన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎఐడిఇఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పి.గోపాలకృష్ణ, జెసిఎం-3 సభ్యులు, ఎన్‌ఎడి యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
![NAD Workers deekshalu](https://prajasakti.com/wp-content/uploads/2025/01/1-NAD-Deeksha.jpg)