ప్రజాశక్తి -యంత్రాంగం మాధవదార : ఐద్వా వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా కంచరపాలెం జోన్‌లో ఐద్వా సీనియర్ నాయకులు ఎం.జయలక్ష్మి జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా కంచరపాలెం జోన్ అధ్యక్షులు కె.అనురాధ మాట్లాడుతూ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆంధ్రప్రదేశ్‌లో 1936లో ఏర్పడిందని, అన్ని రాష్ట్రాలకు విస్తరించి 1981 మార్చి 12న ఐద్వాగా ఏర్పడిందని వివరించారు. మహిళల హక్కుల కోసం పోరాడటం, లింగ సమానత్వం సాధించటం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపించడం లక్ష్యాలుగా ఐద్వా పనిచేస్తుందని చెప్పారు. మహిళల విద్య, ఉద్యోగం, ఆరోగ్యం హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై ఉద్యమాలు నడిపిస్తుందని తెలిపారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాలలో కోటిన్నర సభ్యత్వంతో ఐద్వా విస్తరించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నాయకులు అమలమ్మ, ఎం సుజాత, సిహెచ్.కమలమ్మ, ఒ.విజయ, ఆర్.భవాని తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి : జివిఎంసి 92వ వార్డు బంటా కాలనీ, చైతన్యనగర్‌లో పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షులు బి.పద్మ, నాయకులు రమణి మాట్లాడుతూ, చట్టసభల్లో 33 శాతం మహిళ రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలని, మహిళలపై లైంగిక వేధింపులు వ్యతిరేకంగా, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, మాతృ సంరక్షణ హక్కుల కోసం, అన్ని వర్గాల మహిళలను ఐక్యం చేసి సమాజాన్ని మార్చే దిశగా ఐద్వా ఉద్యమాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట లక్ష్మి, సత్యవతి, రమణమ్మ, సరోజినీ, సూరీడమ్మ, దేముడమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
