Aidwa : హక్కుల పరిరక్షణకు ర్యాలీ, మానవహారం

Dec 10,2024 21:13 #Aidwa rally, #Human Day, #visakhapatnam

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : అంతర్జాతీయ మానవ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐద్వా ఆధ్వర్యాన ‘మహిళా హక్కులే – మానవ హక్కులు’ అనే నినాదంతో మంగళవారం విశాఖలో మానవహారం నిర్వహించారు. తొలుత జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ సమీపంలోని గురజాడ జంక్షన్‌ వరకూ ర్యాలీ చేపట్టారు. అక్కడి కూడలిలో తలపెట్టిన మానవహారాన్ని ఉద్దేశించి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి మాట్లాడారు. ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలో బాలికలు, విద్యార్థినులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులను పొందడం, వాటికోసం పోరాడడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అన్నారు. మహిళా రక్షణకు, సమానత్వానికి చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పాలకులు అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. ఫలితంగా ప్రతి నిమిషానికి ముగ్గురు మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులపై ప్రేమ పేరిట హింస పెరుగుతోందన్నారు. ఒంటరి మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సాంఘిక దురాచారాలను అరికట్టాల్సింది పోయి ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో మానవ హక్కులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి బలమైన స్వతంత్ర పౌర సమాజాన్ని మనమే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి.మణి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యుఎస్‌ఎన్‌.రాజు, కె.సంతోష్‌, ఐద్వా జిల్లా నాయకులు ఆర్‌.వరలక్ష్మి, కె.మణి, కె.కుమారి, బి.భారతి, కె.అనురాధ, వెంకటలక్ష్మి, కె.సంతోషం, బి.మమత, ఒ.విజయ పాల్గొన్నారు.

➡️