ప్రజాశక్తి – కడప అర్బన్ కవితా రచనను ఒక తపస్సులా భావించి అనేక మహాకావ్యాలను రచించిన అక్షర తపస్వి డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ అని యోగి వేమన విశ్వవిద్యాలయం విసి ఆచార్య కె.కష్ణారెడ్డి అన్నారు. డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్ ట్రస్టు, అల్లసాని పెద్దన సాహిత్య పీఠం సంయుక్తంగా ఆదివారం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ 88వ జయంతి, 23వ స్మారక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అతిథులు దీపప్రకాశనం చేసి, భూతపురి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ సాహితీకషి విశిష్టమైందని, ఆయన 1953లో కవిగా సాహితీరంగంలో అడుగుపెట్టి 2002 వరకు అంటే దాదాపు అయిదు దశాబ్దాలపాటు తనదైన విలక్షణతతో సాహితీసేవ చేశారన్నారు. ప్రాచీన మహాకవుల బాటలో ప్రయాణించి, సంస్కతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం సంపాదించి, ప్రబంధశైలిలో ఆంధ్రాభ్యుదయం, శ్రీకష్ణభారతం వంటి మహాకావ్యాలు రచించారన్నారు. ఆయన సాహితీకషికి తార్కాణంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్, గండపెండేరం, గజారోహణం లాంటి గొప్ప సత్కారాలు అందుకున్నారన్నారు. పుత్తా పుల్లారెడ్డి వత్తిరీత్యా ఇంజనీరైనప్పటికీ విమర్శకుడుగా, వ్యాఖ్యాతగా, అనువాదకుడుగా ప్రసిద్ధుడని, బహుగ్రంథకర్త అని, ఆయనను భూతపురి స్మారక పురస్కారంతో సత్కరించడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షులు, డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ ఆచార్య జి.విశ్వనాథ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ బహువిద్యల నేర్పరి అని, ఆయన కవిగా, అవధానిగా, జ్యోతిష వాస్తు శాస్త్రజ్ఞులుగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నారన్నారు. ఆయన అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర సత్కారాలు అందుకున్నారన్నారు. పుత్తా పుల్లారెడ్డి మహాభారతంపై సమగ్రమైన అవగాహన ఉన్నవారని, విమర్శ, వ్యాఖ్యానం, అనువాదం వంటి ప్రక్రియల్లో 18 రచనలు చేశారని, ఆయనను భూతపురి పురస్కారంతో సత్కరించడం సముచితమన్నారు. ‘మహామహోపాధ్యాయ’ ప్రాచార్య శలాక రఘునాథ శర్మ (రాజమండ్రి) మాట్లాడుతూ భూతపురితో తనకు చాలా అనుబంధం ఉందని, ఆయన వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, కవిత్రయం లాంటి మహాకవులను అధ్యయనం చేసి మహాకావ్యాలు రచించిన ఉత్తమకవి అని పేర్కొన్నారు. గౌరవ అతిథి, ఆకాశవాణి పూర్వ సంచాలకులు ఆకుల మల్లేశ్వర రావు (తిరుపతి) మాట్లాడుతూ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ స్వయంకషితో ఉన్నతస్థితికి ఎదిగారన్నారు. మరో గౌరవ అతిథి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ భూతపురి రచించిన శ్రీకష్ణరక్షణ నాటకం, శ్రీభద్రాచల రామ సుప్రభాతం అనే గ్రంథాల విశిష్టతను సభకు పరిచయం చేశారు. ఆత్మీయ అతిథి, యోగి వేమన విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ తాను మొదట రామాయణాన్ని రచించిన సందర్భంలో భూతపురి సుబ్రహ్మణ్య శర్మను కలిశానని, యువకుడైన తనను ఆయన ప్రోత్సహించి, చక్కని అభిప్రాయాన్ని కూడా రాసిచ్చారన్నారు. భూతపురి పురస్కార గ్రహీత, ‘భారత భారతి’ పుత్తా పుల్లారెడ్డిని అతిథులతో కలసి భూతపురి కుమారులు డాక్టర్ శివరామ సురేంద్రశర్మ, డాక్టర్ గోపాలకష్ణశాస్త్రి రూ.10,116 నగదు, జ్ఞాపిక, తలపాగా, శాలువా, సన్మానపత్రంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, భూతపురి ఆత్మీయులు పాల్గొన్నారు.
