కడప కార్పొరేషన్‌లో ప్రొటోకాల్‌ రగడ!

– కుర్చీ కోసం ఎమ్మెల్యే కొట్లాట
– మేయర్‌ పోడియం వద్ద నిరసన
ప్రజాశక్తి-కడప అర్బన్‌ : కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో వైసిపి, టిడిపి నేతల మధ్య నెలకొన్న ప్రొటోకాల్‌ రగడ కొనసాగుతూనే ఉంది. సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో కుర్చీ కోసం మరోమారు ఎమ్మెల్యే మాధవి పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పనులకు నిధులు, కాంట్రాక్టు, అదనపు పారిశుధ్య కార్మికుల వేతనాల నిధులు ఆమోదం కోసం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్‌ ఛాంబర్‌ పక్కన సీటు వేయాలని ఎమ్మెల్యే మాధవి, టిడిపి కార్పొరేటర్లు పట్టుబట్టడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేకు మద్దతుగా, మేయర్‌ మద్దతుగా కార్పొరేటర్లు పోటీపడి నినాదాలు చేశారు. గంటన్నర పాటు నినాదాలతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మేయర్‌ కుర్చీకి ఒకవైపు వైసిపి, మరోవైపు టిడిపి కార్పొరేటర్లు నిల్చుని నిరసన తెలిపారు. టిడిపి, వైసిపి కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అజెండాను కొనసాగించేందుకు సహకరించాలని మేయర్‌ సురేష్‌బాబు పదేపదే విజ్ఞప్తి చేసినా ఎమ్మెల్యే, సభ్యులు వినకపోవడంతో ఎమ్మెల్యేను, ఏడుగురు టిడిపి కార్పొరేటర్లను సస్పెండ్‌ చేస్తూ మేయర్‌ ఆదేశాలు జారీ చేశారు. అయినా వారు బయటకు వెళ్లలేదు. అజెండాను చదివేందుకు ప్రయత్నించిన వెంటనే ఆ కాపీలను టిడిపి కార్పొరేటర్లు చించివేశారు. పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించిన మేయర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు. సభ కొనసాగకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోతాయని మేయర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సభను నిరవధిక వాయిదా వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మేయర్‌ కుడి, ఎడమ వైపు వేదికపై కుర్చీలు వేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారి టిడిపి అధికారంలోకి రాగానే మొదటి సమావేశానికి మేయర్‌ సురేష్‌ బాబు హాజరు కాలేదన్నారు. అప్పుడు కుర్చీ యథావిధిగా ఉంచి తనను గౌరవించారని గుర్తు చేశారు. మేయర్‌ సురేష్‌ బాబు సమావేశానికి హాజరైన ప్రస్తుత మేయర్‌ పక్కన సీటు లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలను మేయర్‌ అవమానిస్తున్నారని పేర్కొన్నారు.

➡️