సమస్యలన్నింటికీ త్వరలో పరిష్కారం

ప్రజాశక్తి-మార్కాపురం : ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను వార్డుల వారీగా పర్యటిస్తూ తెలుసుకుంటున్నామని, త్వరలో ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ”మన ఊరు-మన ఎమ్మెల్యే” కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో సక్రమంగా రహదారులు నిర్మించలేదన్నారు. విద్యుత్‌ లైన్‌ సమస్య ఉందన్నారు. విద్యుత్‌ షాక్‌కు కొందరు గురైనట్లు స్థానికులు ఎమ్మెల్యే కందుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే విద్యుత్‌ లైన్‌ నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే కందుల విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. కొత్తగా పింఛను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కందులను పలువురు కోరారు. అర్హులందరికీ ఫించను మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, టిడిపి బిసి సెల్‌ పట్టణ అధ్యక్షుడు పిన్నిక శివ, టిడిపి నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, సయ్యద్‌ గఫార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️