సెకీ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అదానీతో సెకీ చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ రద్దు చెయ్యాలని సిపిఎం జిల్లా కన్వీనర్‌ పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో నాదనావీధి, బజారు వీధి ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యుత్‌ బిల్లులను పరిశీలించి, కూటమి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారాలు వేయడాన్ని ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం భారీగా పెరిగిన విద్యుత్‌ బిల్లులను బహిరంగంగా దహనం చేశారు. విద్యుత్‌ భారాలు రద్దు చేయాలి, అదానితో చేసుకున్న ఒప్పంధాలు రద్దు చేయాలి, స్మార్ట్‌ మీటర్లు బిగించడం ఆపాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ట్రూ అప్‌ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు, సర్ధుబాటు ఛార్జీలు పేరుతో 40 శాతం ప్రజలపై భారాలు మోపిందన్నారు. చిన్న షాపు యజమాని నవంబర్‌లో రూ.600 కడితే డిసెంబర్‌లో రూ.1100 వచ్చిందన్నారు. 40 శాతం నుండి 80 శాతం వరకు భారీగా పెంచారన్నారు. గత వైసిపి ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి ఈ నాలుగురకాల ఛార్జీలు వేయడానికి సిద్ధం చేసిందని గనుక అది తప్పనిసరిగా కట్టాల్సిందేనని కూటమి ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం విద్యుత్‌ భారాలు మోపితే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకించారని, స్మార్ట్‌ మీటర్లు పెడితే వాటిని ధ్వంసం చేయండని లోకేష్‌ పిలుపునిచారని గుర్తుచేసారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట వచ్చాక ఇంకొకమాట మాట్లాడటం సరైందికాదన్నారు. అదానీతో సెకీ చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలన్నీ ముడుపులతో కూడిన ఒప్పందాలని తేలినప్పుడు వాటిని ఎందుకు రద్దుచేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందాలను గతంలో టిడిపి వ్యతిరేకించడాన్ని గుర్తుచేసారు. సౌర విద్యుత్‌ ఒప్పందాల్లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.1750 కోట్లు ముడుపులు ముట్టాయని చెప్పినా టిడిపి కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందన్నారు. నిత్యం జగన్మోహన్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యే పాలకులు నేడు అదానీతో లింకు ఉండటం వలన మోడీకి లొంగి పోవడం సిగ్గుచేటున్నారు. అదానీతో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలవలన ప్రజలపై అదనంగా రూ.లక్ష కోట్ల భారాలు మోపటానికి సిద్ధపడితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. కార్పొరేట్‌ సంస్థల లాభాలకోసం ప్రజల ఎందుకు బలికావాలన్నారు. ఇప్పటికే అదానీ మూడువేల మెగావాట్లు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఒప్పందంలో పేర్కొన్నా నేటికీ అమలు కాలేదని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, ఫైన్‌ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ఆదాని లాభాలు కోసం ప్రజలపై భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు రామాంజులు, రామచంద్ర, మాధవ, షరీఫ్‌, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.

➡️