ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు

ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు

ఆకస్మిక తనిఖీ చేసిన ఐటిడిఎ పిఒ సింహాచలం

ప్రజాశక్తి -రంపచోడవరం : డివిజన్‌ కేంద్రమైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో అన్నిరకాల వైద్యసేవలు సమర్థవంతంగా రోగులకు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి కట్టా సింహాచలం అన్నారు. గురువారం అసిస్టెంట్‌ కలెక్టర్‌ భావనతో కలిసి స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పిఒ సింహాచలం మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వివిధ రకాల భవనాలను పరిశీలించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. డయాలసిస్‌ సెంటర్‌ను సందర్శించి, రోజువారీ, నెలకు ఎంతమంది కిడ్నీరోగులకు డయాలసిస్‌ చేస్తున్నదీ ఆరా తీశారు.ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలపై వైైద్యాధికారులను ఆరా తీశారు. ఇక్కడ గిరిజనులు నీరు ఎక్కువగా తాగరని, అలాగే ఉప్పు, కారం ఎక్కువగావేసిన ఆహార పదార్థాలను తింటారని, అందుకు కిడ్నీలు పాడౌతున్నాయని వైద్యులు వివరించగా, దానిపై పిఒ స్పందిస్తూ, ప్రతిరోజూ సగటున ఐదు లీటర్లు నీరు తాగేలా గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రసూతి శిశు ఆరోగ్య నూతన భవనాన్ని పరిశీలించారు. ఏరియా ఆసుపత్రిలో డ్రైనేజీ సిస్టం ఏర్పాటు, సెప్టిక్‌ ట్యాంకులు రెగ్యులర్‌గా పరిశుభ్రం చేయకపోవడం వల్ల నెలకొన్న ఇబ్బందులను ఆసుపప్రతి సూపరెంటిండెంట డాక్టర్‌ టివి.శేషారెడ్డి పిఒ దృష్టికి తేగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనను రూపొందించి సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఇబ్బందిలేకుండా వెంటనే వైద్యసేవలు అందించి, అవసరమైన మందులు ఇవ్వాలని ఆదేశించారు. సిికిల్‌సెల్‌ ఎనీమియా విభాగాన్ని పరిశీలించి, ఎంతమంది వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు, ఉచిత మందులు అందిస్తున్నదీ వివరాలపై ప్రశ్నించారు. ఇన్‌పేషెంట్లకు ఎప్పటికప్పుడు తాజా ఆహారం అందజేయాలని సూచించారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశీలించారు. కార్యక్రమలో డాక్టర్‌ ప్రేమ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ చైతన్య,. వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️