శ్రీవాణి టికెట్ల కేటాయింపు సులభతరం

  • గోకులం వద్ద నూతన కౌంటర్‌ ప్రారంభించిన అడిషనల్‌ ఇఒ

ప్రజాశక్తి – తిరుమల : తిరుమలలో ఇచ్చే ఆఫ్‌లైన్‌ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టిటిడి అడిషనల్‌ ఇఒ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి తెలిపారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో అడిషనల్‌ ఇఒ మాట్లాడుతూ.. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్‌ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు యాత్రికులు ఇబ్బంది పడడాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి యాత్రికులు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్‌లైన్‌ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్‌ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదని, ప్రస్తుతం ఒక నిమిషంలో టికెట్‌ కేటాయించేలా మార్పులు చేశామన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా యాత్రికులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ సత్యనారాయణ, డిప్యూటి ఇఒ రాజేంద్ర, విజిఒ సురేంద్ర, ఎఇఒ కృష్ణయ్య పాల్గొన్నారు.

➡️