నులి పురుగులతో రక్తహీనత

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాధన

ప్రజాశక్తి పాడేరు :- జాతీయ నులిపురుగుల నివారణ దినం లో భాగంగా తలారి సింగి ప్రభుత్వ బాలుర పాఠశాలలో 540 మంది విద్యార్థులకు నులిపురుగుల నివారణకు గాను ఆల్బెండజోల్‌ మాత్రలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సిహెచ్‌.సాధన, హెచ్‌ఎం ఆర్‌.జాన్‌ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ మాత్రలను వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఈ మాత్రలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసుకోవడంతో పోట్టలో ఏర్పడే నులిపురుగులను మనం నివారించవచ్చన్నారు. రక్త హీనత బారి నుండి పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని, తెలిపారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, గోర్లను ఎక్కువగా పెంచుకోకూడదని సూచించారు. పరిశుభ్రమైన ఆహారం తినాలని, నులి పురుగులు పొట్టలో ఏర్పడడం వల్ల రక్తహీనత ఏర్పడడమే కాకుండా మనకు వ్యాధులు సంక్రమించినప్పుడు ఆ వ్యాధి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాపాయం కలిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. నులిపురుగులు పొట్టలో ఉండడం మూలంగా మంద బుద్ధి ఏర్పడుతుందన్నారు.ఆరు నెలలకు ఓసారి ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, హెల్త్‌ అసిస్టెంట్‌ శెట్టి నాగరాజు, ఆశ వర్కర్‌ ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

➡️